పాలకూర తాజాగానే... !
శరీరానికి ఫోలేట్ ఎంతో అవసరం అన్నది తెలిసిందే. అయితే ఇటీవల డచ్ పరిశోధకులు దీనిమీద మరింత దృష్టి పెట్టి పరిశోధనలు చేయగా అది జ్ఞాపకశక్తిని పెంచుతుందని తేలింది. రోజూ 800 మైక్రో గ్రాముల ఫోలిక్ ఆమ్లాన్ని వరసగా మూడేళ్లపాటు తీసుకోవడంవల్ల వయసుతోపాటు వచ్చే మతిమరుపు రాకుండా జ్ఞాపకశక్తి పెరుగుౖతుందట. ఎందుకంటే ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల మెదడులోని హిప్పోక్యాంపస్ పనితీరు దెబ్బతింటుంది. అందుకే ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండే లేత తోటకూర, లేత పాలకూరలను తాజాగానే తినాలంటున్నారు. అదెలా అంటే ఉడికించిన నూడుల్స్ లేదా అన్నం, పాస్టా... వంటి వాటిని ఈ తాజా ఆకులమీద వేస్తే ఆ వేడికి అవి కాస్త మెత్తబడి తినడానికి అనుకూలంగా ఉంటాయి. ఇలా రోజూ గుప్పెడు ఆకుల్ని తినడంవల్ల రోజువారీ అవసరమయ్యే ఫోలిక్ ఆమ్లంలో 15 శాతం లభిస్తుందట.