Pages

Friday, 6 February 2015

What to do for silkey & Shiney Hair పట్టులాంటి కురుల కోసం....



పట్టులాంటి కురుల కోసం....

జుట్టు ఊడిపోతుందని, పలుచబడిపోతుందని, మెరుపు కోల్పోతుందని బాధపడని వాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కాలుష్యం, ఒత్తిడి, పోషకాహారలేమి... ఇటువంటి పలు కారణాల ప్రభావం మాత్రం జుట్టు మీదే భారీగానే చూపెడుతోంది. వీటి నుండి తప్పించుకుని జుట్టును సంరక్షించుకునేందుకు వంటింటిని దాటి పోనక్కర్లేదు అంటున్నారు సౌందర్య నిపుణులు. వంటింట్లో లభించే పదార్థాలతోనే మృదువైన, ఆరోగ్యకరమైన, పట్టులాంటి జుట్టును సొంతం చేసుకునేందుకు కొన్ని చిట్కాలను కూడా చెప్తున్నారు వాళ్లు.

అవేంటంటే...

ఉల్లిరసం: ఉల్లిలో సల్ఫర్‌ పుష్కలంగా ఉంటుంది. త్వచాల్లో ఉండే కొల్లాజెన్‌ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సల్ఫర్‌ది ప్రధాన పాత్ర. అదే జుట్టు పెరగడంలోనూ కీలకం అన్నమాట. ఇందుకు ఏం చేయాలంటే... ఎరుపు రంగు ఉల్లిపాయలు లేదా సాంబారు ఉల్లిపాయల్ని చిన్నచిన్న ముక్కలుగా తరిగి రసం తీయాలి. ఆ రసాన్ని మాడు మీద రాసుకుని పావు గంట తరువాత మైల్డ్‌షాంపూతో కడిగేయాలి.

గుడ్డు మాస్క్‌: గుడ్డులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రొటీనే కాకుండా సల్ఫర్‌, జింక్‌, ఐరన్‌, సెలీనియం, ఫాస్పరస్‌, అయోడిన్‌లు కూడా ఉంటాయి ఇందులో. ఇవి జుట్టు ఎదుగుదలకి దోహదం చేస్తాయి. గుడ్డు తెల్లసొనలో ఒక టీస్పూను ఆలివ్‌ నూనె, తేనె వేసి బాగా కలిపితే మెత్తటి పేస్ట్‌లా అవుతుంది. జుట్టు అంతటా ఈ పేస్ట్‌ను పట్టించి 20 నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో తలస్నానం చేయాలి.

మెంతులు: మెంతులు జుట్టు పెరుగుదలలో సాయపడడమే కాకుండా జుట్టుకున్న సహజమైన రంగు పోకుండా కాపాడతాయి. ఒక టీస్పూను మెంతి గుజ్జులో రెండు టీస్పూన్ల కొబ్బరి పాలు పోసి కలపాలి. దీన్ని మాడు, జుట్టుకి పట్టించి అరగంట తరువాత మైల్డ్‌షాంపూతో తలస్నానం చేయాలి.

బంగాళా దుంపల రసం: బంగాళా దుంప రసంలో జుట్టు పెంచే లక్షణాలున్నాయనే విషయం తక్కువ మందికి తెలుసు కావొచ్చు. కాని ఇందులో ఉండే విటమిన్‌ ఎ, బి, సిలు జుట్టుకి ఎంతో ముఖ్యం. ఒకవేళ జుట్టు పలుచబడే (అలోపేషియా) సమస్య ఉంటే బంగాళాదుపం రసం చాలా బాగా పనిచేస్తుంది. బంగాళాదుంపల రసాన్ని మాడుకి రాసుకుని పావుగంట తరువాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.

హెన్నా ప్యాక్‌: హెన్నా సహజసిద్ధమైన కండీషనర్‌, వెంట్రుకల మూలాలకి బలాన్నిచ్చి జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ ప్యాక్‌ తయారీ ఎలాగంటే ఒక కప్పు హెన్నా పొడిలో అర కప్పు పెరుగు కలపాలి. కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు హెన్నా మిశ్రమాన్ని పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరువాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి.

గ్రీన్‌ టీ: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాచి. గోరువెచ్చటి గ్రీన్‌టీని మాడు మీద రాసుకుని గంట తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఉసిరి: ఇది యాంటీఆక్సిడెంట్ల భాండాగారం. విటమిన్‌-సి కూడా ఉంటుంది. ఉసిరి జుట్టును ఆరోగ్యకరంగా ఉంచడమే కాకుండా జుట్టు పిగ్మెంటేషన్‌ పాడు కాకుండా చూస్తుంది. అంటు జుట్టు రంగు మారకుండా ఉంటుందన్నమాట. రెండు టీస్పూన్ల ఉసిరిపొడి లేదా రసంలో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలిపి మాడుకు రాసుకుని ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి.

మిరియాలు: నల్ల మిరియాలు ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తాయి. వీటిలో ఉండే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ మాడుకి తగిన తేమను అందిస్తాయి. రెండు టీస్పూన్ల న ల్ల మిరియాల్లో అర కప్పు నిమ్మరసం వేసి మెత్తటి గుజ్జులా మిక్సీలో పట్టాలి. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్లకు పట్టించి గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్‌ను తలకు చుట్టాలి. ఇలా చేయడం వల్ల ప్రభావం లోతుగా ఉంటుంది. అరగంట తరువాత తలస్నానం చేయాలి.



0 comments:

Post a Comment