Pages

Saturday, 4 May 2013

To reduce the back pain

మూడు రకాల ఆయుర్వేద చికిత్సలతో నడుము నొప్పి ముటుమాయం


నడుము నొప్పి మనిషిని తీవ్రంగా బాధిస్తోంది. ఈ సమస్య ఉంటే ఏ పనీ చేసుకోలేం. పెరిగిపోతున్న పని ఒత్తిడి, మారిన జీవన శైలి, నిద్రలేమి, పోషకాహార ం సరిగా తీసుకోకపోవటం వల్ల ఈ రోజుల్లో 40 ఏళ్లకే నడుము నొప్పి వస్తుంది. ఆయుర్వేదశాస్త్రంలో సమగ్రమైన మూడు రకాల చికిత్సా పద్ధతులతో నడుము నొప్పి సమస్యను శాశ్వతంగా నయం చేయవచ్చంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ కరుణశ్రీ.

ప్రస్తుత పరిస్థితుల్లో మానవ జీవనం ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా ఉంటోంది. ముఖ్యంగా ఆహార లోపాలు, అస్తవ్యస్తమైన దినచర్య,రాత్రివేళ నిద్రపోకపోవడం, పగటి పూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి. అలాగే దిగులు, ఆందోళన, మానసిక ఒత్తిళ్ల వంటి కారణాలు కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుమునొప్పి (కటిశూల). ఆయుర్వేద శాస్త్రం నడుము నొప్పికి గృదసీ వాతంగా నామకరణం చేసింది. నూటికి 90 శాతం మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి తప్పనిసరిగా నడుమునొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది.

సాధారణ కారణాలు
ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవడం, స్థూలకాయం, ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయడం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డు ప్రమాదాలు, కొన్ని దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్య వ్యాధులు ఇవన్నీ నడుము నొప్పికి కారణమవుతుంటాయి. ఈ కారణాల వల్ల మౌలికంగా వాతప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందు పిరుదులకు పై భాగాన స్తబ్దతను, నొప్పిని కలిగించి, ఆ తరువాత నడుము భాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి ఆ నడుము నొప్పి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతకాలంలో ఎక్కువవుతుంది. నడుము భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల ఈ నొప్పి వస్తుంది.

డిస్క్‌ల్లో మార్పులు

వెన్నుపూసల మద్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు డిస్క్‌ల మీద ఒత్తిడి పెరుగుతుంది. వాపు రావడం, డి స్క్‌కి రక్తప్రసరణ సరిగా లేకపోవడం, డిస్కులు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే, అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి, మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది.దీనివల్ల వెన్నునొప్పి వస్తుంది.

లక్షణాలు
నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావడం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కూడా కోల్పోతారు. సమస్య మరీ తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. వెన్నునొప్పి అనగానే చాలా మంది పెయిన్ కిల్లర్స్‌తో కాలయాపన చేస్తారు. వీటివ ల్ల తాత్కాలికంగా ఉపశమనం కలిగినా, దీర్ఘకాలికంగా వెన్నువ్యవస్థ మొత్తంగానే దెబ్బతినిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. పైగా పెయిన్ కిల్లర్స్‌తో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే, ఈ వ్యాధి దరిదాపుల్లోకి రాకుండా పోతుంది.

ఆయుర్వేద చికిత్స
నడుము నొప్పి సమస్యకు ఆయుర్వేదంలో సమగ్రమైన మూడు రకాల వైద్య చికిత్సలు ఉన్నాయి. వాటిలో నిదాన పరివర్జనము, శమన చికిత్స, శోధన చికిత్సలు. నిదాన పరివర్జనము : నిదాన పరివర్జనము అంటే వ్యాధికి కారణమైన విషయాలను పాటించక పోవడం. ఉదాహరణకు విరుద్ద ఆహార, విహార సేవనం(రాత్రి మేల్కొనటం, పగలు నిద్రించడం)

శమన చికిత్స : వ్యాధి యొక్క దోషాలను శమింప చేయటానికి తెచ్చే ఔషధాలు. ఇందులో రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాల లేహ్యాలు, తైలాలు లాంటి ఔషధాలు రోగికి ఇస్తారు. అయితే శమన చికిత్స వల్ల వ్యాధి మళ్లీ తిరగబడవచ్చు.

శోధన చికిత్స : వ్యాధి తీవ్రతను బట్టి శమన చికిత్సలతో ఆగిపోకుండా కొందరికి పంచకర్మ చికిత్స (శోధన చికిత్స) కూడా అవసరమవుతాయి. తద్వారా ప్రకోషించిన దోషాలను (వాత, పిత్త, కఫ) నయం చేసి శరీర శుద్ధితో పాటు అగ్ని బలాన్ని పెంపొందించవచ్చు. ఈ చికిత్సా విధానం ద్వారా శరీరంలో ప్రకోపించిన వాత దోషాలను సమూలంగా తొలగించడం సాధ్యమవుతుంది.

ఆయుర్వేదంలోని స్నేహకర్మ ద్వారా వెన్నపూసల మధ్య స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికలను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది.స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్లను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు. కటివస్తి విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ఠప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి (కార్టిలేజ్) రక్తప్రసరణను పెంచి నడుము నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగాఉపయోగపడుతుంది. అలాగే వస్తికర్మ ద్వారా నాడీకణాల్లో ఏర్పడిన లోపాలను సరిచేయవచ్చు. ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకురావచ్చు. ఆయుర్వేద చికిత్స తర్వాత పోషకాహారం తీసుకుంటూ, క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తే నడుమునొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది.



0 comments:

Post a Comment