డీసెన్సిటైజేషన్‌తో అలర్జీ శాశ్వతంగా దూరం
చికెన్ తింటే ఒళ్లంతా దద్దుర్లు. చేపలు తింటే శరీరమంతా దురద, చివరకు పెరుగు తిన్నా, కాస్త చల్లటి నీళ్లు తాగినా విపరీతంగా తుమ్ములు... అలర్జీతో బాధపడే వారి పరిస్థితి ఇది. మరి జీవితాంతం వీరు అలర్జీతో బాధపడాల్సిందేనా? ఇష్టమైన ఆహారం తినే భాగ్యం లేదా? అంటే ఆధునిక చికిత్సతో అలర్జీని శాశ్వతంగా పారదోలవచ్చని అంటున్నారు సీనియర్ ఇఎన్‌టి సర్జన్ డా. నాగేంద్ర మహేంద్ర.
చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ వేధించే సమస్య అలర్జీ. ఈ సమస్య సాధారణమైనదిగానే కనిపించినా బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సుమారు 20 శాతం మందిలో అలర్జీ సమస్య ఉంటోంది. అందులో 40 శాతం మంది ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లల్లో అలర్జీ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అలర్జీ శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. కానీ ముక్కు, ఊపిరితిత్తుల్లో అలర్జీ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కొందరిలో ఫుడ్ అలర్జీ ఉంటుంది. పడని వస్తువు తిన్న వెంటనే అలర్జీ బయటపడుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే అలర్జీ ముక్కు వరకే పరిమితం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్తమాగా మారే అవకాశం ఉంటుంది. లక్షణాలు
నాసల్ అలర్జీతో బాధపడే వారి జీవనప్రమాణం దెబ్బతింటుంది. రోజు వారి పనులు చేసుకోలేకపోతారు. ముక్కులు మూసుకుపోతాయి. ముక్కు వెంట నీళ్లు కారుతుంటాయి. అదే సమయంలో కళ్ల దగ్గర దురద, కళ్లు ఎర్రగా మారడం, నీరు కారడం జరుగుతుంది. దగ్గు, తుమ్ములు వస్తుంటాయి. పిల్లల్లో అలర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పాఠశాలకు వెళ్లలేకపోతారు. వెళ్లినా పాఠాలు సరిగ్గా వినలేరు. అలర్జీ కొందరిలో సీజనల్‌గా వస్తుంటుంది. మరికొందరిలో ఏడాది పొడవునా ఉంటుంది. శరీరానికి పడని వస్తువు తిన్న వెంటనే దద్దుర్లు వస్తుంటాయి.
కారణాలు
జీవనవిధానంలో మార్పులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటివి అలర్జీకి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చేసే ప్రతీ ఉద్యోగంలో, పనిలో ఒత్తిడి పెరిగింది. ఇదికూడా అలర్జీని తెచ్చిపెడుతోంది. కొన్ని రకాల పండ్లు, పెరుగు, మస్కిటో కాయిల్స్, పెర్‌ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ కూడా అలర్జీ కారకాలే. ఏసీ పడకపోవడం, బేకరీ ప్రోడక్ట్స్, చాక్లెట్స్ వంటివి కూడా అలర్జీని పెంచుతాయి. ఇంట్లో కుక్కలు, పిల్లులు పెంచుకునే అలవాటు ఉంటుంది. ఇది కూడా అలర్జీకి దోహదపడుతుంది. కార్పెట్స్, దుప్పట్లు శుభ్రంగా లేకపోయినా, కర్టెన్స్ దుమ్ముతో పేరుకుపోయినా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద వారిలో అనుకోకుండా తుమ్ములు రావడం జరిగితే అలర్జీ అనుకోవడం సరికాదు. బీపి మాత్రలు, షుగర్‌కు వాడే మందులు, ఇతర మాత్రలు అలర్జీకి కారణమవుతుండవచ్చు.
నిర్ధారణ
అలర్జీని గుర్తించడానికి అనేక పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. నాసల్ అలర్జీని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు. సైనస గదులలో సమస్య ఉన్నదీ తెలుసుకోవడానికి ఎక్స్‌రే, స్కానింగ్ ఉపయోగపడతాయి. ఏ ఆహారపదార్థాల వల్ల అలర్జీ వస్తుందో తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకోవచ్చు. ఏ రకమైన అలర్జీ అనేది తెలుసుకుంటే చికిత్స సులభమవుతుంది. ఫుడ్ అలర్జీని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా యాంటీజెన్ తయారు చేసి సన్నని సూదుల ద్వారా శరీరంలోకి ప్రవేశపెట్టి అలర్జీ కారణాన్ని తెలుసుకోవచ్చు.
చికిత్స
ముందుగా అలర్జీ కారణాన్ని నిర్ధారణ చేసుకోవాలి. సాధారణ అలర్జీనా లేదా ఇతర సమస్య ఉందా పరీక్షించాలి. మందుల వల్ల అలర్జీ వస్తున్నట్లయితే ఆ మందులు మానేస్తే అలర్జీ తగ్గిపోతుంది. చేసే పని, ప్రదేశం కారణమవుతున్నట్లయితే అంటే రైస్ మిల్లులో, కాటన్ పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లయితే ఆ పని మానేయడం. దుమ్ము, ధూళికి దూరంగా ఉండటం, తుమ్ములకు కారణమవుతున్న వాటికి దూరంగా ఉండటం చేయాలి. చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా 50 శాతం వరకు అలర్జీని నియంత్రణలోకి వస్తుంది. ఒకవేళ సైనస్ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లయితే దానికి మందులు వాడటం ద్వారా అలర్జీని నియంత్రించాలి.
10 శాతం మందిలో ఈ జాగ్రత్తలు తీసుకున్నా, అలర్జీ మందులు వాడినా ఫలితం ఉండదు. ఇటువంటి వారికి ఆపరేషన్ అవసరం అవుతుంది. ముక్కులో ఎముక వంకరగా ఉండటం, పాలిప్స్ పెరగడం వంటి సమస్యలు ఉంటే ఆపరేషన్ ద్వారా సరిచేయాల్సి వస్తుంది. ఫుడ్ అలర్జీతో బాధపడుతున్నట్లయితే డీసెన్సిటైజేషన్ చికిత్స బాగా ఉపయోగపడుతుంది. యాంటీజెన్ పరీక్ష చేసి ఏ రకమైన అలర్జీ అనేది తెలుసుకున్న తరువాత ఆ అలర్జీని తగ్గించడానికి డీసెన్సిటైజేషన్ ఇంజెక్షన్‌ను అందించడం జరుగుతుంది. దీనివల్ల అలర్జీ శాశ్వతంగా దూరమవుతుంది. అయితే అందరికీ ఈ చికిత్స పనికి రాదు. ఒకటి రెండు ఆహారపదార్థాలకు అలర్జీ ఉన్నట్లయితే ఈ చికిత్స బాగా పనిచేస్తుంది.
సొంత వైద్యం పనికిరాదు
తుమ్ములు మొదలుకాగానే కొందరు తెలిసిన మాత్రలు తెచ్చి వేసుకుంటుంటారు. మరికొందరు ముక్కులు బ్లాక్ అయ్యాయని నాసల్ డ్రాప్స్ తెచ్చి వేసుకుంటారు. అయితే నాసల్ డ్రాప్స్‌ను నాలుగు రోజులకు మించి వాడకూడదు. నాసల్ డ్రాప్స్ అతిగా వాడితే రైనైటిస్ మెడికమెంటోసా అనే పరిస్థితి తలెత్తుతుంది. అంటే వాడుతున్న మందు వల్ల కూడా అలర్జీ మొదలవుతుంది. అంతేకాకుండా అతిగా వాడటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. మాత్రలు కూడా ఇష్టానుసారంగా వాడకూడదు. సాధారణ జలుబుకు యాంటిబయోటిక్స్ వాడటం మంచిది కాదు. అలర్జీ పెరిగి ఇన్‌ఫెక్షన్ మొదలయినపుడు మాత్రమే యాంటీబయోటిక్స్ వాడాలి. అది కూడా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.
0 comments:
Post a Comment