కలబందతో అందం...ఆరోగ్యం...!
వేసవిలో సూర్య తాపానికి చర్మం తొందరగా దెబ్బతింటుంది. నల్లబడిపోతుంది. అందుకే ఎండాకాలంలో కలబంద (అలొవిరా)ను వాడితే చర్మానికి ఎంతో మంచిదంటారు సౌందర్యనిపుణులు. అంతేకాదు ఆరోగ్యానికి కూడా కలబంద ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. రకరకాల అనారోగ్య సమస్యలు, సౌందర్య సమస్యల పరిష్కారానికి కలబందతో ఎన్నో వంటింటి చిట్కాలను మన ఇళ్లల్లోని బామ్మలు చెపుతుంటారు. కలబంద వల్ల పొందే లాభాల గురించి చెప్పాలంటే చాలా పెద్ద జాబితానే ఉంది. కలబంద జెల్‌ను శరీరంలోని అన్ని భాగాలపైనా రాయొచ్చు. దాని గుజ్జును (జెల్) అలాగే తినొచ్చు. లేదా ఏదైనా ఆహారపదార్థంతో కలిపి తీసుకోవచ్చు. అలా ఇష్టంలేనివారు ఆ జెల్‌ని ఏదైనా డ్రింకులో కలుపుకుని తాగొచ్చు. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు తలెత్తవు. శరీరారోగ్యానికి కూడా ఎంతో మంచిది . కలబంద కాండంపై ఉండే తొక్కు తీసేసి అందులోంచి జెల్‌ని తీస్తారు. దీన్ని ముఖానికి ఫేస్ మాస్క్‌లాగా కూడా వాడొచ్చు. కలబందలోని జెల్ చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు శరీర లోపలి భాగాలను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. కలబంద జెల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. చర్మంపై వచ్చే దద్దుర్లలాంటివాటిని పోగొడుతుంది. మంచి మాయిశ్చరైజర్‌లాగా పనిచేస్తుంది. చర్మానికి కావాల్సినంత తేమను అందిస్తుంది. కూలింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఇంకా వేసవిలో మనం ఎదుర్కొనే సన్‌బర్న్స్, హీట్ రాషెస్ వంటి చర్మసంబంధమైన సమస్యలకు కలబంద బాగా పనిచేస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వారికి కూడా ఇది ఎంతో మంచిది. కలబంద జెల్ శిరోజాలకు కూడా మంచిది. జుట్టును సిల్కీగా ఉంచుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న కలబందను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో పెద్ద డాక్టరున్నట్టే లెక్క... అంతేకాదు చర్మ పరిరక్షణ కోసం బ్యూటీషియన్‌ని ఆశ్రయించనవసరం లేదు...
ఇక ఆలస్యమెందుకు?
మీరు కూడా మీ ఇంట్లో కలబందను పెంచుకోండి. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి...
0 comments:
Post a Comment