Pages

Saturday, 1 November 2014

కుండీల్లో మునగాకు సాగు!



కుండీల్లో మునగాకు సాగు!


* పెరట్లో మునగ చెట్టు ఉంటే విటమిన్లు, టానిక్కులు కొనాల్సిన అవసరం రాదంటారు. మునగను కుండీల్లో ఆకు కోసం, కాయల కోసం కూడా పెంచవచ్చు. విత్తనం వేస్తే ఆరు నెలలు, నెల మొక్క నాటితే 5 నెలల తర్వాత నుంచి మునగాకు కోసుకొని కూరల్లో వాడుకోవచ్చు. ఎండబెట్టి పొడి చేసి.. రోజూ కొంచెం కూరల్లో వేసుకోవచ్చు. ఆకు కోసం పెంచితే.. 4 అడుగుల ఎత్తులో పైచిగురును తుంచేయాలి. పక్కకొమ్మలు పెరిగి ఎక్కువ ఆకు వస్తుంది. కాయలకోసం పెంచితే.. 5 అడుగులు ఎదిగిన తర్వాత పై చిగురును కత్తిరించాలి.

* మునగ చెట్టు పెరట్లో ఉండకూడదన్న సెంటిమెంటు కొందరిలో ఉంది. బొంత(గొంగళి)పురుగు వల్లే ఇది వచ్చి ఉంటుంది. బొంత పురుగు రాకుండా చేయడానికి ఓ చిట్కా ఉంది. మొక్క 6 నెలలు పెరిగిన తర్వాత.. కింది నుంచి 2 అడుగుల ఎత్తు వరకు పాలిథిన్ పేపర్‌ను చుట్టి.. దానిపై నూనెను పూస్తే బొంత పురుగు చెట్టెక్కలేదు. బొంతపురుగులు మొక్క మొదట్లో మట్టిలో ఉండే గుడ్ల నుంచి పుట్టుకొస్తాయి. ఆ గుడ్లను తవ్వితీసి నాశనం చేస్తే సమస్యే ఉండదు.

* కమలాల్లో కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, క్యారెట్లలో కంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ, పాలల్లో కంటే 4 రెట్లు ఎక్కువ క్యాల్షియం, అరటిపండ్లలో కంటే 3 రెట్లు ఎక్కువ పొటాషియం, పెరుగులో కంటే 2 రెట్లు ఎక్కువ మాంసకృత్తులు మునగాకులో ఉన్నాయి.

* మునగాకును పప్పులో, సాంబారులో వేయొచ్చు. వేపుడు చేయొచ్చు. మునగ కాయల్లో కన్నా ఆకుల్లో పోషకాలు ఎక్కువ. మునగ పువ్వును చట్నీ చేయొచ్చు.

* మునగాకు పొడి చేసేదిలా: లేత మునగాకును కడిగి, నీడలో ఆరబెట్టాలి. గలగలలాడేలా ఆరిన మునగాకును పొడి చెయ్యాలి. పొయ్యి మీద నుంచి దించిన తరువాత కూరలు, చారు వంటి వాటిల్లో వేసి కలపాలి.

0 comments:

Post a Comment