గుండె, ఊపిరితిత్తులు ఎలా విశ్రాంతి తీసుకుంటాయి ?
గుండె, ఊపిరితిత్తులు విశ్రాంతి తీసుకోవడమంటే, ఏకంగా పైకి వెళ్ళిపోవటమే అనుకుంటారంతా. అది పొరబాటు. శరీరంలో నిరంతరం పనిచేసే అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు కూడా ప్రతిరోజు కొన్ని గంటలపాటు విశ్రాంతి తీసుకునేట్లు తయారుచేయబడ్డాయి. కానీ మన ఆహార, విహారాదులు ఆ విశ్రాంతిని వాటి కి దూరం చేస్తున్నాయి.
గుండె, ఊపిరితిత్తులు సవ్యంగా పనిచేస్తే మానవుడు ఎంతో శక్తివంతంగా, ఎక్కువకాలం జీవించవచ్చు. వాటి ఆరోగ్యానికి, పెందలాడే చేసే భోజనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఆహారాన్ని తింటే దానిని అరిగించుకోవడానికి జీర్ణకోశానికి ఎక్కువ రక్తాన్ని, ప్రాణవాయువు అందించడానికి గుండె, ఊపిరితిత్తులు ఎక్కువ పని చేయాలి. మనం పగలు తినడంతో పాటు తిరుగుతూ ఉంటాము కాబట్టి కండరాలకు కూడా ఎక్కువ రక్తాన్ని, ప్రాణవాయువు అందించడానికి గుండె, ఊపిరితిత్తులు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది.
మనం పగలు తినడం, తిరగడం అనే రెండు పనులు చేసినంత సేపు గుండె నిమిషానికి 72 సార్లు అంతకంటే ఎక్కువ కొట్టుకుంటే, ఊపిరితిత్తులు నిమిషానికి 18 సార్లు అంతకంటే ఎక్కువ కొట్టుకొని శరీర అవసరాలను తీరుస్తూ అలసిపోతుంటాయి. లెక్కప్రకారం మనం పగలే తినాలి, తిరగాలి. అలాగే మీరు సాయంకాలం 6 గంటలకు తేలిగ్గా భోజనం చేసారు. అది రాత్రి 9 గంటలకి అరిగిపోతుంది. మీరు 10 గంటలకల్లా పడుకున్నారు. అంటే జీర్ణక్రియకు, శరీరానికి విశ్రాంతి. కాబట్టి మీ గుండె, ఊపిరితిత్తులు ఎక్కువ రక్తాన్ని, ప్రాణవాయువును శరీరానికి అందించాల్సిన అవసరం లేదు. దీంతో గుండె, ఊపిరితిత్తులు విశ్రాంతి తీసుకుంటాయి. పగలు నిమిషానికి 72 సార్లు కంటే ఎక్కువగా కొట్టుకునే గుండె, మీరు పెందలాడే తిని పడుకోవడం వల్ల ప్రతి నిమిషానికి సుమారుగా 60 సార్లు మాత్రమే కొట్టుకుని ప్రతి నిమిషానికి 10 నుండి 12 సార్లు విశ్రాంతి తీసుకుంటుంది. ఒక నిమిషానికి 10 సార్లు అయితే ఎన్ని నిమిషాలున్నా అలా గంటలపాటు (నిద్రలేచేవరకూ) విశ్రాంతి లభిస్తున్నదో చూడండి. ఆ విశ్రాంతిలో గుండె కండరానికి ఎంత బలం పెరుగుతుందో ఆలోచించండి. అలాగే ఊపిరితిత్తులు అయితే నిమిషానికి 18 సార్లు బదులుగా 12 నుంచి 14 సార్లే కొట్టుకుని 4 నుండి 6 సార్లు ప్రతి నిమిషానికి విశ్రాంతిని తీసుకుంటున్నాయి. ఇలా కాకుండా రాత్రి 10, 11 గంటలకి ఫుల్లుగా తిని పడుకుంటే అది అరిగే దాకా (సుమారు తెల్లవారుదాకా)గుండె, ఊపిరితిత్తులు నిరంతరం పనిచేయాల్సిందే. అందుచేతనే 60,70 సంవత్సరాలు వచ్చేసరికి ఈ అవయవాలు మొండికేస్తున్నాయి. పొద్దు పోయిందాకా తినడం, అర్ధరాత్రి వరకూ తిరగడం చేస్తూ గుండె, ఊపిరితిత్తుల పాలిట శాపంగా మనం తయారవుతున్నాం.
పొట్టఖాళీగా ఉంటే సుఖనిద్ర ఎందుకు పడుతుంది ?
సాధారణంగా పొట్టనిండా ఆహారం తీసికొంటేనే సుఖంగా నిద్రపడుతుందని అందరూ భావిస్తారు. పొట్టఖాళీగా ఉంటేనే సుఖనిద్ర పడుతుంది. ఇది నిజం. సాయంకాలం 5.30 నుంచి 6.00 గంటల వరకూ అందరూ ఆకలితో ఇంటికి చేరతారు. అప్పుడే భోజనం చేస్తే నిద్రరాదని, ఆ టైంలో చిల్లరతిండి తిని, రాత్రి 9 లేదా 10 గంటలకు భోజనం చేస్తే మత్తుగా నిద్ర వస్తుందని భావిస్తారు. పొట్టనిండా భోజనం చేస్తే మత్తు వస్తుంది. ఎందుకంటే మీ లోపల ఉన్న శక్తి, రక్తం, ప్రాణవాయువు మొదలైనవన్నీ జీర్ణాశయానికి మళ్ళించబడేసరికి, మీలో హుషారు తగ్గి మత్తుగా అవుతారు. అప్పుడు పడుకుంటే మీకు మత్తు నిద్ర వస్తుంది. మనిషికి కావాలసినది గాఢనిద్ర లేదా సుఖనిద్ర కాని మత్తు నిద్రకాదు. అసలు నిద్ర అంటే విశ్రాంతి. ఏ అవయవాలు నిద్రలో విశ్రాంతి తీసుకోవాలి? శరీరంలోని అన్ని అవయవాలా? లేదా కొన్నా?. అన్ని అవయవాలు విశ్రాంతి తీసుకుంటేనే మరలా ఉదయాన్నే చురుగ్గా అన్నీ పనిచేయగలవు. మీరు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య పొట్టనిండా తిని పడుకుంటే ఏ అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయో ఆలోచించండి. కాళ్లు, చేతులు, కండరాలు, నరాలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నాయి. మరి పొట్టనిండా ఆహారం తిని పడుకున్నందుకు దానిని అరిగించడానికి గుండె, ఊపిరితిత్తులు ఎక్కువ పనిచేసి రక్తాన్ని ఆక్సిజన్‌ని అందించాలి. పొట్ట, ప్రేగులు, లివరు, పాంక్రియాన్ మొదలైన జీర్ణరసాలను ఊరించి ఆహారాన్ని అరిగించాలి. ఇన్ని అవయవాలు లోపల పనిచేస్తూ ఉంటే దానిని విశ్రాంతి అంటారా? దానిని సుఖనిద్ర అంటారా? ఈ పనులన్నీ అయ్యి పొట్ట, ప్రేగులు రెస్టు తీసుకోవడం ఎప్పటి నుండి ప్రారంభిస్తాయో, అప్పటినుండి మీ శరీరం అసలైన విశ్రాంతిని పొందడం ప్రారంభిస్తుంది. అప్పటినుండే గాఢనిద్ర లేదా సుఖనిద్ర ప్రారంభం వస్తుంది. తిని పడుకుంటే అది అరిగే దాకా మీకు మత్తునిద్ర మాత్రమే వస్తుంది.
అందరూ తిని పడుకుంటే బాగా నిద్ర వస్తుందంటుంటారు. ఎంతమంది పడుకున్న 5 లేదా 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకునేవారు చెప్పండి. నూటికి 90 మంది పైగా నిద్ర పట్టడానికి 30 నుండి 60 నిమిషాల వరకూ మంచం మీద పడుకుని నిద్రరాక పనికిరాని కబుర్లన్నీ చెప్పుకోవడం లేదా అటూ, ఇటూ దొర్లడం చేస్తారు. ఆ తర్వాత నిద్ర రాకుంటే కొందరైతే మందుబిళ్ళలు వాడుతున్నారు. మరికొందరు మద్యం సేవిస్తున్నారు.
మనిషి పడుకున్న దగ్గర్నుండీ లేచే లోపుగా బాగా గాఢంగా, సుఖంగా నిద్రపట్టే టైం ఏదని అడిగితే అందరూ తెల్లవారుజాము 3 నుంచి 4 గంటల మధ్యలో అని సమాధానమిస్తారు. రాత్రి పడుకుంటే తెల్లవారుజామునే ఎందుకు సుఖ నిద్ర పట్టిందో అర్థమయ్యిందా ? మీ లోపల అన్ని పనులు అప్పటికి పూర్తయ్యాయి. అందుకే శరీరం హాయిగా గాఢనిద్రలోకి వెళ్తుంది. రాత్రిపూట 10 నుంచి 11 గంట మధ్య తిని పడుకోవడం వల్ల మీ శరీరం 2 నుంచి 3 గంటల పాటే సుఖనిద్ర పోతున్నది. అదే మీరు సాయంకాలం 6 గంటల కల్లా తింటే పడుకునే లోపు తిన్నది అరుగి వెంటనే నిద్రలోకి వెళ్తారు. పడుకున్న దగ్గర్నుంచీ సుఖనిద్ర 5 లేదా 6 గంటల పాటు పట్టి తెల్లారుజాము 4 గంటలకి మెలకువ వస్తుంది. నిద్రలేచిన దగ్గర్నుంచీ చాలా హుషారగా, కొత్తశక్తితో, చురుగ్గా ఉంటారు. పగలు వెలుతురుండగానే భోజనం చేస్తే పడుకున్న వెంటనే గాఢనిద్రలోకి వెళ్తారని మరవకండి.
0 comments:
Post a Comment