Pages

Tuesday, 18 November 2014

Risks of smoking ప్రాణాంతకం!


ప్రాణాంతకం!

మీకు సిగరెట్‌ తాగే అలవాటుందా? అయితే కచ్చితంగా మీరు అల్పాయుష్కులేగాక వ్యాధిగ్రస్తులు కూడా. ఎందుకంటే సిగరెట్‌, బీడీ, చుట్టా ఏది పీల్చే అలవాటున్నా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. శ్వాస కోశ, క్యాన్సర్‌, సిఒపిడి వంటి వ్యాధులు పొగపీల్చేవారిని వెంటాడుతూనే ఉంటాయి. వీటిలో ఏదోఒక వ్యాధి పొగరాయళ్లను కచ్చితంగా వేధిస్తుంది. అందుకే పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని, పొగపీల్చే అలవాటును దూరం చేసుకోవాలి. సిగరెట్లు తాగేవారిలో చాపకింద నీరులా ఎక్కువమందిని వెంటాడుతున్న ఊపిరితిత్తుల వ్యాధుల్లో సిఒపిడి (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) ఒకటి. ఈ వ్యాధివల్ల ఊపిరితిత్తులు పాడైపోయి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.

సిఒపిడిని ఒకప్పుడు క్రానిక్‌ బ్రాంకైటిస్‌, ఎంఫిసిమా అని రెండు వ్యాధులుగా పరిగణించేవారు. కానీ ఇప్పుడీ రెండింటినీ కలిపి కేవలం సిఒపిడిగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. వీటిలో క్రానిక్‌ బ్రాంకైటిస్‌లో కళ్లె ఎక్కువగా పడుతుంది. ఎంఫిసిమాలో ఆయాసం అధికంగా ఉంటుంది. అయితే ఈ రెండింటికీ కారణం ధూమపానమే. సిగరెట్‌, చుట్టా, బీడీ ఇవన్నీ సిఒపిడి వ్యాధిని కలిగించేవే. ఊపిరితిత్తుల వ్యాధి పురుషులకే కాదు, పొగపీల్చే అలవాటున్న మహిళలకూ వస్తుంది. ఆస్తమా కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధే అయినా సామాన్యంగా ఏదోఒక సీజన్లో వస్తూ, పోతూ ఉంటుంది. కానీ సిఒపిడి అలా కాదు. వచ్చిందంటే పోదు. క్రమంగా ముదురుతూ ఉంటుంది. దీనివల్ల ఆయాసమే కాదు, కనీసం మూత్ర విసర్జనకు కూడా లేచి నాలుగు అడుగులు వేయలేని దుస్థితి వస్తుంది. తరచూ దగ్గు, జ్వరం, కళ్లె (తెమ్డా) సమస్యలు ఉంటాయి. కొందరు బరువు తగ్గుతారు. ఎంత తిన్నా పరిస్థితి అలాగే ఉంటుంది. ఆశ్చర్యం అనిపించినా తిన్నదంతా ఊపిరిపీల్చుకోవడానికే సరిపోతుందనేది వాస్తవం. ఇక శరీరానికి శక్తి ఎలా లభిస్తుంది? ధూమపానం చేసే వ్యక్తి తన జీవితంలో సిగరెట్లు, బీడీలకే తన సంపాదనలో 15 శాతం ఖర్చు చేస్తుండగా, వాటి ప్రభావంతో వ్యాధిబారిన పడిన తర్వాత తగ్గించుకునేందుకు 30 శాతం ఖర్చు చేస్తున్నారని ఆరోగ్య నిపుణుల అంచనా.

కారణాలు

క్రానిక్‌ బ్రాంకైటిస్‌ సిగరెట్లు, బీడీలు తాగేవారిలో కనిపిస్తుంది. ఏళ్లతరబడి ధూమపానం చేసేవారు కచ్చితంగా ఈ వ్యాధిబారిన పడతారు. పరోక్ష ధూమపానంవల్ల, అంటే ఒకరు సిగరెట్‌ పొగపీల్చి వదలడంవల్ల, ఆ పొగ పీల్చిన ఇతరులకు కూడా క్రానిక్‌ బ్రాంకైంటిస్‌ రావచ్చు. వాతావరణ కాలుష్యంవల్ల, వడ్రంగిపనివల్ల, మైనింగ్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీల్లో పనివల్ల సిఒపిడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కట్టెలపొయ్యిమీద వంటచేసేవారు నిరంతరం పొగలో ఉండటంవల్ల ఈ వ్యాధి రావచ్చు. వాహనాలు నడిచేటప్పుడు విడుదలయ్యే పొగను పీల్చడంవల్ల కూడా వస్తుంది.

లక్షణాలు

ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. రోజువారీ పనులు సరిగ్గా చేసుకోలేరు. వ్యాధి ముదిరేకొద్దీ శరీరం నిస్సత్తువగా మారిపోతుంది. కదలికలు తగ్గిపోతాయి. కిటికీలు లేని గదిలోకి వెళ్లినా, బాత్‌రూమ్‌లో ఉన్నా, కాస్త వంగున్నా, జలుబు చేసినా ఊపిరి తీయడం కష్టంగా మారుతుంది. ఆకలీ, బరువూ తగ్గుతాయి. కళ్లు తిరుగుతాయి.

ఎలా గుర్తించాలి?

ఎంతకీ మానని దగ్గు, కాస్త రంగుగా కళ్లె పడుతున్నప్పుడు సిఒపిడి ఉందేమో పరీక్ష చేయించుకోవడం మేలు. సిఒపిడి, ఎంఫిసిమా, ఇతర ఊపిరి తిత్తుల వ్యాధులను కచ్చితంగా డాక్టర్లు మాత్రమే నిర్ధారించగలుగుతారు. పల్మనరీ ఫంక్షన్‌ టెస్టు ద్వారా ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయనేది తెలుసుకోవచ్చు. కళ్లె పరీక్షలు, ఎక్స్‌రేలు కూడా ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి. సిటిస్కాన్‌ చేయించుకుంటే బుల్లాలను (ధూమపానంవల్ల ఊపిరితిత్తుల్లో పాడైపోయిన చిన్న చిన్న వాయుకోశాలు కలిసిపోయి పెద్ద తిత్తిలా మరుతాయి. పాడైపోయిన ఈ తిత్తి శ్వాస ప్రక్రియ సరిగ్గా నిర్వహించదు. దీనినే బుల్లా అని వ్యవహరిస్తారు) గుర్తించే వీలుంటుంది.

చికిత్స

పొగపీల్చడం తక్షణమే మానేయాలి. లేదంటే వ్యాధి మరింత ముదురుతుంది. ఇన్‌హేలర్‌ ద్వారా మందులు వాడితే ఊపిరితిత్తుల్లో శ్వాస నాళాలు కాస్త వదులుగా మారి శ్వాస తేలిగ్గా అందుతుంది. పరిస్థితినిబట్టి ఆక్సిజన్‌ అందించాల్సి వస్తుంది. సిగరెట్లు తాగడంవల్ల ఊపిరితిత్తులు పాడైపోయినప్పుడు, వ్యాధి ముదిరి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు ఆపరేషన్‌ చేయాల్సి రావచ్చు. దీనినే లంగ్‌ రీడక్షన్‌ సర్జరీ అంటారు. అంటే ఊపిరితిత్తుల్లోని బుల్లాలను తొలగిస్తారు. 

0 comments:

Post a Comment